Andhra Pradesh: తాళికట్టే వేళ ఎంటరైన 'ప్రేమికుడు'.. ఆగిపోయిన పెళ్లి!

  • కర్నూలు జిల్లా డోన్‌లో ఘటన
  • పెళ్లి జరుగుతుండగా వచ్చి హల్‌చల్ చేసిన నంద్యాల యువకుడు
  • పెళ్లి రద్దు చేసుకున్న వరుడి తరపు బంధువులు
సాధారణంగా సినిమాల్లో కనిపించే ఇలాంటి సీన్ కర్నూలు జిల్లా డోన్‌లో ఆదివారం కనిపించింది. ఘనంగా జరుగుతున్న పెళ్లి ఓ యువకుడి ఎంట్రీతో ఆగిపోయింది. అతడెవరో తనకు తెలీదు మొర్రో అని వధువు మొత్తుకుంటున్నా వినకుండా వరుడి తరపు బంధువులు పెళ్లిని రద్దు చేశారు.

ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అబ్బాయితో డోన్‌కు చెందిన అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం ఓ ఫంక్షన్‌హాల్‌లో పెళ్లి జరుగుతోంది. వధువు, వరుడి తరపు బంధువులతో హాలు కిక్కిరిసిపోయింది. మరికాసేపట్లో వరుడు తాళికడతాడనుకుంటున్న వేళ నంద్యాలకు చెందిన సురేశ్ అనే యువకుడు వచ్చి హంగామా చేశాడు. పెళ్లి కుమార్తె-తాను ప్రేమించుకున్నామంటూ నానా రచ్చ చేశాడు. దీంతో అతడిని పట్టుకున్న వధువు తరపు బంధువులు పోలీసులకు అప్పగించారు.

కాగా, యువకుడి ఎంట్రీతో అప్పటి వరకు ఉన్న సందడి ఒక్కసారిగా మారిపోయింది. వరుడి తరపు బంధువులు పెళ్లి  రద్దు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పీటల మీది నుంచి అబ్బాయి లేచి వెళ్లిపోయాడు. ఆ సురేశ్ ఎవరో తనకు తెలియదని, ఇంతకుముందు ఎప్పుడూ అతడిని తాను చూడలేదని వధువు నెత్తీనోరు బాదుకున్నా వరుడి తరపు బంధువులు వినిపించుకోలేదు. పెళ్లి రద్దు చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, వధువు తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh
Kurnool District
Done
Nandyal
marriage

More Telugu News