Rahul Sinha: అలాంటప్పుడు రోడ్డుపైనే అంతిమ సంస్కారాలు చేపడతాం: బెంగాల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి

  • అంతిమ సంస్కారాలను అడ్డుకోవడమేంటి?
  • పార్టీ కార్యాలయానికి తరలించి తీరుతాం
  • శాంతియుతంగా తరలిస్తామన్నా వినలేదు

టీఎంసీ - బీజేపీ కార్యకర్తల మధ్య పశ్చిమబెంగాల్‌లోని బసిర్‌హట్‌లో నిన్న జరిగిన ఘర్షణలో నలుగురు బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. అయితే వీరి మృతదేహాలను పార్టీ కార్యాలయానికి తరలిస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయమై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాహుల్ సిన్హా మాట్లాడుతూ, బీజేపీ కార్యకర్తల హత్యలను నిరోధించలేని పోలీసులు అంతిమ సంస్కారాలను అడ్డుకోవడమేంటని ఫైర్ అయ్యారు.

ఊరేగింపులు లేకుండా, శాంతియుతంగానే మృతదేహాలను పార్టీ కార్యాలయానికి తరలిస్తామన్నా పోలీసులు వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అవరోధాలు కల్పించినా తమ పార్టీ కార్యకర్తల మృతదేహాలను పార్టీ కార్యాలయానికి తరలించి తీరుతామని రాహుల్ సిన్హా స్పష్టం చేశారు. ఒకవేళ తీసుకెళ్లనీయకుండా అడ్డుకుంటే రోడ్డుపైనే అంతిమ సంస్కారాలు చేపడతామని హెచ్చారించారు. అయితే భద్రతా బలగాలు అడ్డుకుంటున్న విషయాన్ని గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి దృష్టికి తీసుకెళ్లగా సీనియర్ అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారని రాహుల్ సిన్హా తెలిపారు.  

More Telugu News