Trinamool: బెంగాల్‌లో చెలరేగిన తృణమూల్-బీజేపీ కార్యకర్తలు.. ముగ్గురి మృతి

  • టీఎంసీ జెండాలను తొలగిస్తుండడంతో మొదలైన ఘర్షణ
  • ఇరు వర్గాల మధ్య కాల్పులు
  • భారీగా మోహరించిన పోలీసులు
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మృతి చెందారు.  వీరిలో ఒకరు టీఎంసీ కార్యకర్త కాగా, మిగతా ఇద్దరు బీజేపీ కార్యకర్తలు. రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిందీ ఘటన. కోల్‌కతాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేజాత్ పట్టణంలోని సందేశ్‌ఖాళీ ప్రాంతంలో రాత్రి ఏడుగంటల ప్రాంతంలో కొందరు బీజేపీ కార్యకర్తలు టీఎంసీ జెండాలను తొలగిస్తుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.

అది క్రమంగా పెద్దదై దాడిచేసుకునే వరకు వెళ్లింది. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులకు దిగాయి. బీజేపీ కార్యకర్తల కాల్పుల్లో 26 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త ఖయూం మొల్లా మృతి చెందగా, ప్రతిగా టీఎంసీ కార్యకర్తలు జరిపిన కాల్పుల్లో  ఇద్దరు బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, మరో బీజేపీ కార్యకర్త తపన్ మండల్ కూడా ఈ ఘర్షణల్లో మృతి చెందాడని, మరో ఐదుగురు అదృశ్యమయ్యారని బీజేపీ ఆరోపిస్తోంది.

తొలుత తృణమూల్ కార్యకర్తలే కాల్పులకు దిగారని బీజేపీ ఆరోపిస్తుండగా, బీజేపీ వారే తొలుత కాల్పులకు దిగారని తృణమూల్ ఆరోపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున మోహరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Trinamool
BJP
West Bengal

More Telugu News