Chiranjeevi: ఇన్నేళ్లలో నేను కోల్పోయింది, లోటుగా భావించేది అదొక్కటే: చిరంజీవి

  • ఎస్వీఆర్ ను కనీసం ప్రత్యక్షంగా చూడలేకపోయాను
  • ఆయనే నా ఆరాధ్యనటుడు
  • మహానటుడు పుస్తకావిష్కరణలో చిరంజీవి భావోద్వేగం
తెలుగువాళ్లు గర్వించదగ్గ మహానటుల్లో ఎస్వీ రంగారావు ఒకరు. ఆయనపై సంజయ్ కిషోర్ రాసిన 'మహానటుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అగ్రహీరో చిరంజీవి హాజరయ్యారు. ఆయన ఎస్వీ రంగారావు గురించి మాట్లాడుతూ, భావోద్వేగాలకు లోనయ్యారు. తనకు నటుడు అవ్వాలన్న కోరిక కలిగింది ఎస్వీఆర్ కారణంగానే అని చెప్పారు.

ఎస్వీఆర్ నటించిన జగత్ కిలాడీలు, జగజ్జంత్రీలు చిత్రాల్లో తన తండ్రి చిన్న పాత్రలు పోషించారని, ఆ సమయంలో ఎస్వీఆర్ గురించి ఇంటి వద్ద తన తండ్రి చెబుతుంటే ఆసక్తిగా వినేవాడ్నని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. నటుడిగా పేరు తెచ్చుకోవాలన్న కోరిక బలపడింది అప్పుడేనని తెలిపారు. అయితే, తన ఆరాధ్యనటుడైన ఎస్వీ రంగారావు గారిని తన జీవితంలో ఎన్నడూ కలవలేకపోవడం తీరనిలోటుగా మిగిలిపోయిందని చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. కనీసం ఆయన్ని ప్రత్యక్షంగా కూడా చూడలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లలో తాను కోల్పోయింది, లోటుగా భావించేది ఏదైనా ఉందంటే అది ఎస్వీఆర్ ను కలవలేకపోవడమేనని తెలిపారు.
Chiranjeevi

More Telugu News