Tiger: పులుల లెక్కను బయటపెట్టొద్దు: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఎన్‌టీసీఏ ఆదేశం

  • ప్రతీ నాలుగేళ్లకోసారి పులుల గణాంకాలను విడుదల చేసే ఎన్‌టీసీఏ
  • ఏడాదిన్నర ఆలస్యమైనా ఇంకా విడుదల చేయని వివరాలు
  • రాష్ట్రాలు పంపిన డేటాను విశ్లేషిస్తున్నట్టు వివరణ

పులుల లెక్కను బయట పెట్టొద్దని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని 50 టైగర్ రిజర్వులతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పులులు కలిగిన 18 రాష్ట్రాలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ నాలుగేళ్లకు ఓసారి పులుల సంఖ్యను లెక్కించి విడుదల చేసే ఎన్‌టీసీఏ చివరిసారి 2014లో గణాంకాలు విడుదల చేసింది. గతేడాది జనవరిలో దేశవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్యను లెక్కించిన ఎన్‌టీసీఏ ఇప్పటి వరకు వాటి వివరాలను బహిర్గతం చేయలేదు.

పులుల లెక్కకు సంబంధించి ఆయా రాష్ట్రాలు పంపిన రా డేటాను ఇప్పటి వరకు విశ్లేషించలేదని ఎన్‌టీసీఏ తెలిపింది. వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సాయంతో ఈ డేటాను విశ్లేషించి సరైన గణాంకాలను విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ విషయంలో పులుల సంఖ్యకు సంబంధించి కొన్ని రాష్ట్రాలు విడుదల చేస్తున్న డేటాలో ప్రామాణికత లేదని, కాబట్టి ఆ గణాంకాలను విడుదల చేయవద్దని పులులు కలిగిన రాష్ట్రాలకు ఎన్‌టీసీఏ ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News