Guntur District: ప్రజల్లోనే ఉంటూ ముందుకు వెళ్దాం: పవన్ కల్యాణ్

  • ఎన్నికల ఫలితాలతో వెనకడుగు వేసే ప్రసక్తే వద్దు
  • ప్రతి క్షణం జనంతోనే మమేకం కావాలి
  • ప.గో., కృష్ణా జిల్లాల జనసేన అభ్యర్థులతో భేటీ

సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో వెనకడుగు వేసే ప్రసక్తే వద్దని, ప్రజల్లోనే ఉంటూ ముందుకే వెళ్దామని జనసేన  పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే కాదు ప్రతి క్షణం మనం జనంతోనే మమేకమై వారికి ఏ ఇబ్బంది వచ్చినా మనం ఉన్నామనే భరోసా ఇవ్వాలని సూచించారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు ప్రజల కోసం ఏం చేయాలో, మౌలిక సదుపాయాలు వారికి అందేలా ఎలా చేయాలో  ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలని ఆదేశించారు.

పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి జనసేన తరఫున పోటీ చేసిన లోక్ సభ, శాసనసభ అభ్యర్థులతో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులు తమ అనుభవాలను, ఫలితాలను ఎలా చూస్తున్నదీ వివరించారు. అనంతరం, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఈ ఫలితాలపై ఎవరికి వారే స్వీయ విశ్లేషణ చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు ‘జనసేన’కు పడిన ఓట్లన్నీ పార్టీపై బలమైన విశ్వాసం ఉన్నవారి నుంచి వచ్చినవేనని అన్నారు. అలాగే, మన పార్టీని ఏదో రీతిన అణచి వేయాలని చూస్తూనే ఉంటారని, ప్రజలకు మరో ప్రత్యామ్నాయం ఉండకూడదని అనుకొంటారని, అలాంటి వారిని బలంగా ఎదుర్కోవాలని చెప్పారు. ఏ దశలోనూ వెనకడుగు వేసేది లేదని, తమకు జన బలం, యువతరం తమ వెంట ఉందని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో అభ్యర్థుల తరఫున నియోజకవర్గాల్లో పని చేసేందుకు ఎన్నారైలు, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకొంటున్న యువత వచ్చిందని, వారంతా కమిటెడ్ గా తమ కోసం ఉన్నవారని, అలాంటి వారితో ఎప్పటికప్పుడు అనుసంధానం కావాలని సూచించారు. జనసేన పార్టీ ఏ విధమైన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్ళాలి, క్షేత్ర స్థాయిలో ఎలా బలోపేతం కావాలనే అంశంపై అన్ని జిల్లాల సమావేశాలు పూర్తయిన తరవాత వారితో కలిసి మరోసారి చర్చిస్తానని చెప్పారు. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులతో రేపు సమావేశం ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

More Telugu News