Kishan Reddy: ​అమిత్ షా నన్ను మందలించే సమస్యే లేదు... ఇంకాస్త గట్టిగా తిట్టమనే చెబుతారు: కిషన్ రెడ్డి

  • అమిత్ షా మందలించారనడంలో నిజంలేదు
  • ఆ వార్తలు చూసి నవ్వుకున్నా
  • ఓ ఇంటర్వ్యూలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
తెలంగాణలో బీజేపీకి చాన్నాళ్లుగా మూలస్తంభంలా  కొనసాగుతున్న నేత గంగాపురం కిషన్ రెడ్డి. వివాదరహితుడిగా పేరుపొందిన కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. కేంద్ర  హోంశాఖ సహాయమంత్రిగా పదవిని అధిష్ఠించిన కిషన్ రెడ్డి ఢిల్లీలో ఇవాళ ఓ మీడియా చానల్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు బదులిచ్చారు.

పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్దిసేపటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతిలో చీవాట్లు తిన్నట్టు వచ్చిన వార్తలపై కూడా వివరణ ఇచ్చారు. ఎవరు పుట్టించారో కానీ, ఆ వార్తలు చూసి నవ్వుకున్నానని, అమిత్ షా తనను మందలించారనడంలో నిజంలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. టెర్రరిజానికి హైదరాబాద్ మూలకేంద్రంగా మారిందని తాను వ్యాఖ్యానించానని, అయితే, ఉగ్రవాదం విషయంలో ఇంకా గట్టిగా మాట్లాడాలని అమిత్ షా చెబుతారే తప్ప, ఎప్పుడూ డిసప్పాయింట్ చేసేలా మాట్లాడరని తెలిపారు.

మజ్లిస్ మతోన్మాదం విషయంలో గానీ, గూండాయిజం విషయంలో కానీ తాము మెతకగా వ్యవహరిస్తున్నామని, మీరైనా దూకుడు ప్రదర్శించాలని అమిత్ షా సూచిస్తారని,  ఆయన తనను మందలించే సమస్యే లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Kishan Reddy
Amit Shah
BJP

More Telugu News