Belt Shops: రేపటి నుంచే బెల్టు షాపులను తొలగించండి.. సిబ్బందికి ఏపీ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆదేశాలు!

  • 10 రోజుల్లోపు బెల్టు షాపులను మూసివేయాలి
  • స్టేషన్ల వారీగా నివేదికలు పంపాలి
  • అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదు
  • ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
రేపటి నుంచే ఆంధ్రప్రదేశ్‌లో మద్యం బెల్టు షాపుల నియంత్రణ మొదలు కావాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం బెల్టు షాపులను పూర్తిగా తొలగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఎక్సైజ్ శాఖ కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనా, తమ శాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పది రోజుల్లోపు రాష్ట్రంలోని బెల్టు షాపులు ఎక్కుడున్నా మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ రోజుకారోజు కమిషనర్ కార్యాలయానికి ఎక్సైజ్ స్టేషన్ల వారీగా నివేదికలు పంపాలని ముఖేశ్ కుమార్ సూచించారు. దీనికి బాధ్యులుగా గ్రామానికో కానిస్టేబుల్‌ను, మండలానికో ఎస్సైను నియమించనున్నట్టు ఆయన తెలిపారు.

అంతేకాకుండా మద్యం బెల్టు షాపుల నియంత్రణలో నూరు శాతం ఫలితాలు సాధించిన సిబ్బందికి రివార్డులు ఇచ్చి సత్కరిస్తామన్నారు. బెల్టు షాపులకు సంబంధించిన పూర్తి సమాచారం ఎక్సైజ్ సిబ్బందికి తెలియనిది కాదని, సిబ్బంది అంతా గట్టిగా అనుకుని పనిచేస్తే షాపుల తొలగింపు కష్టమేమీ కాదన్నారు.

ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని, ఎవరు అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని అన్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం విక్రయిస్తున్నట్టు వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ముఖేశ్ కుమార్ సూచించారు. గంజాయి అక్రమ రవాణా నివారణకు, అసలు గంజాయినే సాగులో లేకుండా ఆబ్కారీ శాఖ చూడాలని ముఖేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు.
Belt Shops
Mukhesh Kumar Meena
Jagan
Andhra Pradesh
Constable

More Telugu News