Kerala: నిపా వైరస్ రిటర్న్స్!... కేరళలో మళ్లీ కలకలం

  • జ్వరంతో బాధపడుతున్న విద్యార్థి
  • రక్తపరీక్ష ఫలితాలు వస్తేగానీ చెప్పలేమంటున్న కేరళ ఆరోగ్య మంత్రి
  • పుకార్లను నమ్మవద్దంటూ విజ్ఞప్తి
గత సంవత్సరం కేరళను వణికించిన నిపా వైరస్ మరోసారి భయాందోళనలు రేకెత్తిస్తోంది. తాజాగా ఓ విద్యార్థి నిపా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరడంతో కేరళ వ్యాప్తంగా కలకలం మొదలైంది. ఇడుక్కి జిల్లాలోని తోడుప్పుజ పట్టణానికి చెందిన ఓ కాలేజీ విద్యార్థి ట్రైనింగ్ నిమిత్తం త్రిసూర్ వచ్చాడు. తీవ్రజ్వరం రావడంతో అతడ్ని ఆసుపత్రిలో చేర్చారు. రోజుల తరబడి జ్వరం కొనసాగడంతో ఆ స్టూడెంట్ ను ఎర్నాకుళం తరలించి మరో ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు. నిపా వైరస్ లక్షణాలు కనిపిస్తుండడంతో అతడ్ని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు.

దీనిపై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ వివరణ ఇచ్చారు. 23 ఏళ్ల విద్యార్థి జ్వరంతో బాధపడుతున్నాడని, అతడి బ్లడ్ శాంపిల్స్ ను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్టు తెలిపారు. రక్తపరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత అతడికి సోకింది నిపా వైరస్సా? కాదా? అనేది నిర్ధారణ అవుతుందని చెప్పారు. పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Kerala

More Telugu News