Jagtial District: అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా... శ్వాస తీసుకుని ఆశ్చర్యపరిచిన మహిళ!

  • తలకు గాయమైతే ఆసుపత్రికి తరలింపు
  • చికిత్స పొందుతూ చనిపోయిందని చెప్పిన వైద్యులు
  • బతికే ఉందని తెలియడంతో ఆశ్చర్యపోయిన కుటుంబం
ప్రమాదంలో తలకు తీవ్రగాయమైన మహిళను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేస్తుండగా ఆమె బతికే ఉందని తెలియడంతో ఆశ్చర్య పోవడం వారి వంతయింది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా సారంగపూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కుటుంబ సభ్యుల కథనం మేరకు...గ్రామానికి చెందిన కనకమ్మ అనే మహిళ గాయపడడంతో అత్యవసర చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. చికిత్స అందిస్తుండగానే ఆమె చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో  కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో కనకమ్మ ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఆమె బతికే ఉందని గుర్తించి ఆనందంతో హుటాహుటిన జగిత్యాలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

కాగా, కనకమ్మకు తొలుత వైద్యం అందించిన ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, బ్రతికే ఉందన్న విషయం సరిగా గమనించకుండానే చనిపోయినట్లు చెప్పారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
Jagtial District
women funerals

More Telugu News