Telangana: నిజామాబాద్ లో ఓటమిపై తొలిసారి స్పందించిన కల్వకుంట్ల కవిత!

  • నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ విజయం
  • ఓడిపోయినా నియోజకవర్గంలోనే ఉంటానన్న కవిత
  • టీఆర్ఎస్ శ్రేణులు మనోధైర్యం కోల్పోవద్దని వ్యాఖ్య

సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన ఓటమిపై తొలిసారిగా స్పందించారు. నిజామాబాద్ లోని మంచిప్పలో గుండెపోటుతో కన్నుమూసిన టీఆర్ఎస్ కార్యకర్త కిషోర్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయినా నిజామాబాద్ ను విడిచిపెట్టబోనని కవిత తెలిపారు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఈసారి ప్రజలు మరొకరిని గెలిపించారని, గెలిచిన అభ్యర్థులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు టీఆర్ఎస్ శ్రేణులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని కవిత సూచించారు. తాను ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. నిజామాబాద్ లో 70,875 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఘనవిజయం సాధించారు.

More Telugu News