Jagan: మోదీతో ముగిసిన జగన్ భేటీ... వెంటనే అమిత్ షా వద్దకు!

  • దాదాపు గంటకు పైగా సాగిన భేటీ
  • పలు అంశాలను చర్చించిన జగన్
  • ఆపై మారిన ఢిల్లీ పర్యటన షెడ్యూల్
కాబోయే ప్రధాని నరేంద్ర మోదీతో, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా వీరిద్దరి సమావేశం జరిగింది. ఏపీ ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలు తదితర అంశాలపై జగన్ వివరిస్తుంటే, సమస్యలన్నింటినీ విన్న మోదీ, సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఎటువంటి సమస్య ఉన్నా, పరిష్కరించేందుకు తనవంతు కృషిని కేంద్రం చేస్తుందని మోదీ హామీ ఇచ్ఛారని సమాచారం. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని, ప్రజల సెంటిమెంట్ తో కూడిన ప్రత్యేక హోదాను ఇవ్వాలని కూడా జగన్ కోరారు. మోదీతో భేటీ అనంతరం ఏపీ భవన్ కు బయలుదేరిన జగన్, మార్గమధ్యంలో అమిత్ షా ఇంటికి వెళ్లి ఆయన్ను కూడా కలవాలని నిర్ణయించుకున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ లో అమిత్ షాతో భేటీ లేనప్పటికీ, మోదీ సూచన మేరకు జగన్, అమిత్ షా ఇంటికి వెళుతున్నట్టు తెలుస్తోంది. మారిన షెడ్యూల్ కారణంగా మధ్యాహ్నం 12.30 గంటలకు ఏపీ భవన్ కు చేరుకోవాల్సిన జగన్, ఒంటిగంట తరువాతే అక్కడకు వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Jagan
Narendra Modi
Amit Shah
New Delhi

More Telugu News