Narendra Modi: నా ప్రమాణ స్వీకారోత్సవానికి రండి...ప్రధాని మోదీని కలిసి ఆహ్వానించిన జగన్‌

  • ఢిల్లీ  చేరుకుని నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లిన జగన్‌
  • రెండోసారి విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ అధినేత
  • అనంతరం రాష్ట్ర సమస్యలు, ప్రత్యేక హోదా అంశం ప్రస్థావన
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం వైసీపీ ఎల్పీ లీడర్‌గా ఎన్నికైన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈనెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. నిన్న వైసీపీ ఎల్పీ లీడర్‌గా ఎన్నికైన అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్న జగన్‌ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే.

ఈరోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ చేరుకున్నజగన్‌ నేరుగా లోక్‌కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసానికి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించిన మోదీని అభినందించిన అనంతరం తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలను ఆయన ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. జగన్‌ వెంట సీఎస్‌ ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పలువురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ప్రధానితో సమావేశం ముగిశాక ఆంధ్రాభవన్‌కు వెళ్లనున్న జగన్‌ అక్కడ ఆంధ్రాక్యాడర్‌ ఐఏఎస్‌ అధికారులతో సమావేశం కానున్నారు.
Narendra Modi
jaganmohanreddy
New Delhi
meet

More Telugu News