Andhra Pradesh: చంద్రబాబు అక్రమంగా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 23.. టీడీపీ గెలిచిందీ 23: వైఎస్ జగన్

  • దేవుడు ఎలా మొట్టికాయలు వేస్తాడో చెప్పడానికి నిదర్శనం చంద్రబాబే
  • దేవుడు అంత గొప్పగా స్క్రిప్ట్ రాశాడు
  • 2024 ఎన్నికల్లో ఇంకా గొప్పగా మనం ఎన్నుకోబడాలి
చంద్రబాబు అక్రమంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సంఖ్య 23 అని, ఈ ఎన్నికల్లో చంద్రబాబు సహా ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23 అని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ 23 అని వైసీపీ అధినేత జగన్ లాజికల్ గా మాట్లాడుతూ టీడీపీపై సెటైర్ వేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఎల్పీ నేతగా జగన్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, అక్రమాలు చేస్తే దేవుడు ఏ రకంగా మొట్టికాయలు వేస్తాడో చెప్పడానికి నిదర్శనం చంద్రబాబేనని, దేవుడు అంత గొప్పగా స్క్రిప్ట్ రాశాడని అన్నారు.

ప్రజలు మనకు గొప్ప బాధ్యత అప్పగించారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. 2024 ఎన్నికల్లో ఇప్పటి కంటే గొప్పగా మనం ఎన్నుకోబడాలంటే, అంత గొప్పగా మనం పనిచేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరూ చూడని విధంగా ప్రక్షాళన చేస్తానని, దేశంలో ఎప్పుడూ జరగని విధంగా ప్రక్షాళన చేస్తానని చెప్పారు. ఇందుకు, పార్టీ నాయకులందరూ సహకరించాలని కోరారు.

‘జగన్ మంచి ముఖ్యమంత్రి’ అని అనిపించుకుంటానని, మంచి చేసేందుకు దేవుడు తనకు మనసు, జ్ఞానం ఇవ్వాలని కోరారు. త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయని, ఆ ఎన్నికల్లో ‘క్లీన్ స్వీప్’ చేయాలని పార్టీ నాయకులకు జగన్ సూచించారు.

కాగా, వైసీపీ కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం ముగిసిన అనంతరం, వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది.
Andhra Pradesh
YSRCP
jagan
Chandrababu

More Telugu News