Araku MP: గెలుపుతోపాటు రికార్డు సొంతం చేసుకున్న గిరిజన ఎంపీ.. ఆమె వయసు 25 ఏళ్లే!

  • అరకు పార్లమెంటరీ నియోజకవర్గం ప్రతినిధి గొడ్డేటి మాధవి ఘనత ఇది
  • లోక్‌సభకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కురాలు
  • గతంలో హిసార్ ఎంపీ దుష్యంత్‌ చౌతాలా పేరున రికార్డు
రాజకీయంగా ఓనమాలు నేర్చుకునే వయసులోనే ఎన్నికల గోదాలో అరంగేట్రం చేసి ఉద్ధండుడిపై భారీ మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకోవడమేకాక మరో రికార్డును కూడా తన సొంతం చేసుకున్నారు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి. కేవలం 25 ఏళ్ల 3 నెలల వయసుకే ఎంపీగా ఎన్నికై లోక్‌సభ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కురాలైన ప్రతినిధిగా రికార్డుకెక్కారు.

 ఇంతకు ముందు ఈ రికార్డు 2014 ఎన్నికల్లో హర్యానా రాష్ట్రం హిసార్‌ లోక్‌సభ స్థానం నుంచి జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) తరపున గెలుపొందిన దుష్యంత్‌ చౌతాలా పేరున ఉండేది. ఈయన ఎంపీగా గెలిచే సమయానికి వయసు 26 ఏళ్ల 13 రోజులు. గొడ్డేటి మాధవి ఈ రికార్డును చెరిపేశారు. విశాఖ జిల్లా అరకు పార్లమెంటరీ నియోజక వర్గం నుంచి వైసీపీ తరపు మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తె మాధవి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఆరు నెలల క్రితం జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా  వైసీపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. తమలోని ఒకరిగా భావించిన గిరిజనం ఆమెకు భారీ మెజార్టీతో పట్టం కట్టింది.

ఈమెపై తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్‌ పార్లమెంటేరియన్‌, మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్‌ పోటీచేసిన విషయం తెలిసిందే. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కిశోర్‌ కుమార్తె శృతీదేవి కూడా బరిలో నిలిచి ఓటమిని చవిచూశారు.
Araku MP
younger parlmenterian
age 25 years
Visakhapatnam District

More Telugu News