Andhra Pradesh: జగన్ మోహన్ రెడ్డి కళ్లలో నాకు తడి కనిపించింది!: మోహన్ బాబు

  • మా ఊరికి రావద్దు అని కొట్టుకున్నారు
  • ఎవరికైనా ఓటేసుకోండి.. కులం గజ్జి వద్దు
  • జగన్ ఓ పెదరాయుడు.. అనుకున్నది సాధిస్తాడు
  • తిరుపతిలో మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేత, నటుడు మోహన్ బాబు అభినందనలు తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజలు కులాల పరంగా విడిపోయి కొట్టుకున్నారనీ, ఇది తన మనసుకు చాలా బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోహన్ బాబు మాట్లాడారు.

‘మా ఊరికి రావొద్దు నువ్వు అని కొట్టుకున్నారు. గాలి ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి రాదా? భూగర్భంలోని నీళ్లు ఓ ఊరి నుంచి మరో ఊరిలోకి రావా? చిత్తూరు జిల్లాలో ఇలాంటి గొడవలు జరిగాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు, కొందరు కులస్తులు తెలుసుకుంటే మంచిది. మీరు ఎవరికైనా ఓటేసుకోండి అయ్యా. కులం గజ్జి వద్దు.

ఈ విషయాన్ని గత 27 ఏళ్లుగా చెబుతూనే ఉన్నా. ఈసారి కులంపై గొడవలు చేయాలని ఎవరు చెప్పారో, ఎవరి ప్రోద్బలం ఉందో వాళ్ల పాపాన వాళ్లే పోతారు’ అని వ్యాఖ్యానించారు. జగన్ ఓ పెదరాయుడు అనీ, జగన్ ఏది అయితే అనుకున్నాడో అది సాధిస్తాడని స్పష్టం చేశారు. జగన్ కళ్లలో నిన్న తడి కనిపించిందనీ, ప్రజలను ఎలా ఆదుకోవాలన్న తపన ఆయన కళ్లలో కనిపించిందని అభిప్రాయపడ్డారు. తన స్నేహితుడు అంబరీష్ భార్య సుమలత ఘనవిజయం సాధించిందని, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
Andhra Pradesh
YSRCP
Jagan
mohanbabu

More Telugu News