Road Accident: అవుటర్ రింగురోడ్డుపై ప్రమాదం.. కూకట్‌పల్లి బీజేపీ నేత, ఆయన భార్య దుర్మరణం

  • పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఘటన
  • శామిర్‌పేటలో డివైడర్‌ను ఢీకొట్టిన కారు
  • ప్రాణాలతో బయపడిన అన్నా, చెల్లెలు
అవుటర్ రింగురోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత, ఆయన భార్య మృతి చెందగా, వారి ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లిలోని  బాలకృష్ణనగర్‌ కాలనీకి చెందిన బీజేపీ చేనేత విభాగం మేడ్చల్‌ జిల్లా కమిటీ కన్వీనర్‌ బొడ్డు నరేందర్‌ (46).. భార్య నాగరాణి(42), కుమారుడు వినయ్‌(26), దీప్తి(24)లతో కలిసి కారులో చౌటుప్పల్ వెళ్లారు. అక్కడ వారి బంధువుల ఇంట్లో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరైన అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరారు.

ఈ క్రమంలో అవుటర్ రింగు రోడ్డు మీదుగా వస్తుండగా శామిర్‌పేట టోల్‌గేట్ వద్ద అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. వెంటనే స్పందించిన వాహనదారులు, స్థానికులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే నరేందర్, నాగరాణి అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలపాలైన  వినయ్‌, దీప్తి చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident
BJP
Hyderabad
kukatpally
Telangana

More Telugu News