RK Roja: ఎగ్జిట్ పోల్స్‌ను గుడ్డిగా నమ్మలేం: వైసీపీ నేత రోజా

  • అనుభవం ఉందని చంద్రబాబును గెలిపిస్తే ఏమీ చేయలేకపోయారు
  • అందుకనే జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు
  • వైసీపీ గెలుపు పక్కా
ఆదివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పై వైసీపీ నేత ఆర్కే రోజా స్పందించారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్‌ను గుడ్డిగా నమ్మలేమన్నారు. వ్యక్తిగతంగా అయితే ఇటువంటి సర్వేలను తాను విశ్వసించనని తేల్చి చెప్పారు. అయితే, ఏపీ ప్రజలు మాత్రం జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. జగన్‌లా పాదయాత్ర చేసిన వారు ఈ దేశంలో మరెవరూ లేరన్నారు. తాము నిత్యం ప్రజలతో మమేకమై వారు ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకున్నట్టు రోజా చెప్పుకొచ్చారు.

జగన్ తన పాదయాత్ర ద్వారా ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారన్నారు. జగన్ కచ్చితంగా సీఎం కాబోతున్నారని, ఇది పక్కా అని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఎంతో అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబును గెలిపిస్తే ఏమీ చేయలేకపోయారని, అందుకనే ఇప్పుడు జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తాయన్నారు.

More Telugu News

RK Roja
YSRCP
Jagan
Andhra Pradesh
Chandrababu