Andhra Pradesh: విజయవాడలో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కట్టలేని దద్దమ్మలు నన్ను విమర్శిస్తున్నారు!: కేవీపీ రామచంద్రరావు

  • దేశంలోనే తొలిసారి పోలవరం అథారిటీ తెచ్చాం
  • మొత్తం ఖర్చు కేంద్రం భరిస్తుందని యూపీఏ చెప్పింది
  • డ్యామ్ ఎప్పుడు పూర్తిచేస్తారో ఏపీ ప్రభుత్వం చెప్పాలి
దేశంలో మరే జాతీయ ప్రాజెక్టుకు లేనివిధంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీని తాము తీసుకొచ్చామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడే అనుమతులు అన్నీ వచ్చేశాయని చెప్పారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టును ఆపాలనుకున్నా అది కుదరదని వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేవీపీ రామచంద్రరావు.. ఏపీ మంత్రి దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలు తనను విమర్శించడంపై తీవ్రంగా స్పందించారు.

‘పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడం ఎవరితరమూ కాదు. ఎవరు ఎన్ని కేసులు వేసుకున్నా ప్రయోజనం ఉండదు. పోలవరం ప్రాజెక్టు ఖర్చంతా కేంద్రమే పెట్టుకోవాలని యూపీఏ ప్రభుత్వం 2014 ఏపీ పునర్విభజన బిల్లులో పెట్టింది. పోలవరం ప్రాజెక్టు అన్నది ఏపీ ప్రజల హక్కు. దాని నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేయాల్సిందే. కొందరు టీడీపీ నేతలు నేను పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడినట్లు చెబుతున్నారు.

నేనెలా అడ్డుపడ్డానో వాళ్లంతా జవాబు ఇవ్వాలి. 2020లో కూడా కాఫర్ డ్యామ్ ద్వారా గ్రావిటీతోనే నీళ్లు అందించబోతున్నారు. మెయిన్ డ్యామ్ పనులు ఎప్పుడు పూర్తవుతాయో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలి. వీళ్ల చేతకానితనానికి ఇతరులను నిందిస్తే ఎలా? విజయవాడలో గత ఐదేళ్లుగా కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కట్టలేని దద్దమ్మలు అక్కడి ప్రజలను అష్టకష్టాలకు గురిచేస్తున్నారు. పోలవరానికి అన్ని అనుమతులు తీసుకొచ్చిన నన్ను బాధ్యుడిని చేసి విమర్శిస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
kvp
Congress
polavaram

More Telugu News