కేసీఆర్ ఇస్తున్న షాక్స్ తో గుత్తాకు మతిభ్రమించింది: కోమటిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
మతి భ్రమించింది తమకు కాదని, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఇస్తున్న షాక్స్ తో గుత్తాకు మతిభ్రమించిందని, అందుకే, ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలియట్లేదని అన్నారు. నాడు సీఎం వైఎస్ తో మాట్లాడి గుత్తాను ఎంపీగా పోటీ చేయించి గెలిపించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పార్టీలు మారిన చరిత్ర గుత్తాది అని, ఆయన అంతటి అవినీతిపరుడు దేశంలోనే లేడని ఆరోపించారు.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గుత్తా రాజకీయ జీవితం ముగిసినట్టేనని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గుత్తాకు మంత్రి పదవి కాదు కదా, కనీసం ఎమ్మెల్సీ టికెట్ కూడా రాదేమోనని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీలతో పాటు మూడు జెడ్పీ చైర్మన్లు తమవేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ను విమర్శించే నైతిక హక్కు గుత్తాకు లేదని అన్నారు.  
Go Back to Shorts
cm
kcr
nalgonda
gutta
komatireddy

More Telugu News