Andhra Pradesh: అమరావతిలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం

  • క్యాబినెట్ భేటీ అజెండాలోని అంశాలపై ప్రధాన చర్చ
  • తుపాను సహాయక చర్యలపైనా చర్చించిన కమిటీ
  • కమిటీ నిర్ణయించిన తుది అజెండాను సీఈసీకి పంపనున్న ద్వివేది
రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 14న ఏపీ క్యాబినెట్ భేటీ నిర్వహించనున్న నేపథ్యంలో ప్రధానంగా క్యాబినెట్ భేటీ అజెండాలోని అంశాలపై స్క్రీనింగ్ కమిటీ సభ్యులు చర్చించారు. అంతేకాకుండా, ఫణి తుపాను సహాయక చర్యలు, రాష్ట్రంలో కరవు, తాగునీటి సమస్యలపైనా చర్చ జరిగింది.

వేసవిలో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరడం, పర్యవసానాలు, గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరుతెన్నులు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించిన క్యాబినెట్ భేటీ అజెండా తుది రూపును రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఆపై  కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని బట్టి చంద్రబాబు సర్కారు క్యాబినెట్ భేటీ నిర్వహణ సాధ్యాసాధ్యాలు ఆధారపడి ఉంటాయి.
Andhra Pradesh

More Telugu News