Supreme Court: న్యాయమూర్తుల పదోన్నతికి సీనియారిటీ కంటే యోగ్యతే ప్రధానం!: కేంద్రానికి షాకిచ్చిన సుప్రీం కోర్టు

  • కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం
  • కొలీజియం సిఫారసు చేసిన పేర్లపై కేంద్రం అడ్డుపుల్ల
  • పట్టించుకోని ఎపెక్స్‌ కోర్టు

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం పొందాల్సిన వారికి సీనియారిటీ కంటే యోగ్యతే ప్రధానమని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొలీజియం సిఫారసు చేసిన పేర్లపై కేంద్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. దీంతో న్యాయమూర్తుల పదోన్నతుల విషయంలో కేంద్రం, సుప్రీం కోర్టు మధ్య మరోసారి విభేదాలు నెలకొన్నట్టయింది. వివరాల్లోకి వెళితే..ఝార్ఖండ్‌, గువహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు  జస్టిస్‌ అనిరుద్దాబోస్‌, ఎ.ఎస్‌.బోపన్న పేర్లను పదోన్నతుల కోసం సుప్రీం కోర్టు కొలీజియం గత నెల 12న సిఫారసు చేసింది. వీరికి పదోన్నతిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరాలను ఎపెక్స్‌ కోర్టు తోసిపుచ్చుతూ మరోసారి వారిద్దరి పేర్లనే సిఫారసు చేసింది.

దీనిపై ఈరోజు సమావేశమైన కొలీజియం పదోన్నతుల విషయంలో సీనియారిటీ కంటే యోగ్యతకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. అందువల్ల  జస్టిస్‌ అనిరుద్దాబోస్‌, ఎ.ఎస్‌.బోపన్న పేర్లను మరోసారి ప్రతిపాదించింది. వీరితోపాటు బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గువాయ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్లను కూడా ప్రతిపాదించింది. సుప్రీం కోర్టులో మొత్తం 31 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 27 మంది మాత్రమే ఉన్నారు.

More Telugu News