Visakhapatnam District: ఫలితాలు వచ్చే వరకు శ్రావణ్‌ను మంత్రిగా కొనసాగించవచ్చా?: అడ్వకేట్‌ జనరల్‌ సలహా కోరిన సీఎం చంద్రబాబు

  • చట్టసభల్లో సభ్యుడు కాకుండా అమాత్యుడైన శ్రావణ్‌
  • ఈనెల 10తో ముగుస్తున్న ఆరు నెలల గడువు
  • గవర్నర్‌ కార్యాలయం సమాచారంతో సీఎంఓ సంప్రదింపులు
విశాఖ జిల్లాకు చెందిన మంత్రి శ్రావణ్‌కుమార్‌ను సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కొనసాగించవచ్చా? లేక ముందుగానే రాజీనామా చేయించాలా? అన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు న్యాయసలహా కోరారు. ఈ మేరకు ఆయన అడ్వకేట్‌ జనరల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును గత ఏడాది సెప్టెంబరులో మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో సర్వేశ్వరరావు కొడుకు శ్రావణ్‌కు సీఎం చోటు కల్పించారు. అయితే ఏ సభలోనూ సభ్యుడు కాని శ్రావణ్ ఆరు నెలలలోపు ఎన్నిక కావాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో అరకు నుంచి ఆయన పోటీ చేసినా ఫలితాలు ఈనెల 23వ తేదీన రానున్నాయి.

అయితే, ఈలోగా గడువు ముగుస్తోందని పేర్కొంటూ గవర్నర్‌ కార్యాలయం ఇచ్చిన సమాచారంతో ముఖ్యమంత్రి ఈ దిశగా ఆలోచన చేస్తున్నారు. శ్రావణ్‌ను కొనసాగించడానికి న్యాయపరంగా ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో చూడాలని ఏజీని చంద్రబాబు కోరారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ఎన్నిక ప్రచారం చేస్తున్నారు. అక్కడి నుంచి రాగానే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Visakhapatnam District
araku
kidari sravan
Chandrababu

More Telugu News