Lok Sabha: బీజేపీ అభ్యర్థిని చితకబాదిన మమత వర్గీయులు.. కశ్మీర్ లోని పోలింగ్ బూత్ పై గ్రెనేడ్ దాడి

  • కశ్మీర్, పశ్చిమబెంగాల్ లో హింసాత్మక ఘటనలు
  • టెన్షన్ టెన్షన్ గా పుల్వామా
  • టీఎంసీ దాడిలో గాయపడ్డ బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్
సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ నేడు పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. పలు చోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నా కశ్మీర్, పశ్చిమబెంగాల్ లలో హింస చోటుచేసుకుంది.

కశ్మీర్ లోని ఉగ్రదాడి జరిగిన పుల్వామాలో (అనంతనాగ్ నియోజకవర్గం) ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా పుల్వామాలోని ఓ పోలింగ్ బూత్ పై ఆగంతుకులు గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఘటన నేపథ్యంలో, ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దాడులు జరుగుతాయనే భయంతో ఇక్కడ ఏ పార్టీ నేతలు కూడా ప్రచారం నిర్వహించలేదు. మరోవైపు, ఇక్కడ ఓటింగ్ శాతం రెండంకెల శాతానికి కూడా చేరుకోకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఇక పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్ లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బారక్ పూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్ పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. దాడి అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓటర్లతో తాను మాట్లాడుతుండగా తనపై టీఎంసీ వర్గీయులు దాడి చేశారని చెప్పారు. పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని తెలిపారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో టీఎంసీ మూకల దాడులకు అంతులేకుండా ఉందని మండిపడ్డారు. రక్తం కారుతున్న తన నోరే దీనికి నిదర్శనమని చెప్పారు.
Lok Sabha
polling
pulwama
West Bengal

More Telugu News