Andhra Pradesh: ప్రియురాలి ఇంట్లో ప్రియుడి మృతి.. మదనపల్లెలో కలకలం!

  • రెండేళ్లుగా ప్రేమలో శశికుమార్-ఐశ్వర్య
  • ప్రియురాలి ఇంట్లో ఉరేసుకున్న ప్రియుడు
  • ఇంటికి పిలిచి చంపేశారంటున్న బాధిత కుటుంబం
ప్రియురాలి ఇంట్లో ప్రియుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అంగల్లులో చోటుచేసుకుంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని  కమతంపల్లెకు చెందిన శశికుమార్‌, అంగల్లుకు చెందిన ఐశ్వర్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు వీరిని హెచ్చరించారు. ఇకపై ఇద్దరూ కలుసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పెద్దలు హెచ్చరించాక కూడా వీరు రహస్యంగా కలుస్తుండడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో విషయం పోలీసు స్టేషన్‌కు చేరింది.

ఇరు కుటుంబాల మధ్య గొడవ జరుగుతుండగానే ఆదివారం ప్రియురాలి ఇంటికి వచ్చిన శశికుమార్ అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐశ్వర్య కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 శశికుమార్‌ది హత్యేనని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంటికి పిలిపించి హత్య చేశారని చెబుతున్నారు. లేదంటే శశికుమార్ వారింటికి ఎందుకు వెళ్తాడని ప్రశ్నిస్తున్నారు. తమ కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని, దర్యాప్తు చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.  
Andhra Pradesh
Chittoor District
Madanapalle
love
police

More Telugu News