Summer: 'ఫణి' అటు వెళ్లగానే... నిప్పుల కొలిమిలా మారిన తెలుగు రాష్ట్రాలు!

  • సాధారణం కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు
  • వేడిగాలులే కారణమన్న వాతావరణ శాఖ
  • మరో మూడు రోజులు ఇంతేనని హెచ్చరికలు
'ఫణి' తుఫాను ఒడిశా వైపు వెళ్లగానే తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారిపోయాయి. గడచిన వారం రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలతో ఉన్న తెలంగాణలో, తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కోస్తాంధ్ర, రాయలసీమల్లో భానుడి భగభగ మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అనంతపురం వరకూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి.

ప్రకాశం జిల్లా గుడ్లూరులో 45.3, బాపట్లలో 44, కావలిలో 44.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ లో 43, రామగుండంలో 43.5, ఖమ్మంలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పడమటి గాలుల కారణంగానే వేడి పెరిగిందని, గాలిలో తేమ శాతం తగ్గిపోయిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

మరో రెండు మూడు రోజుల పాటు వడగాల్పులు తప్పవని, తుఫాను ఉత్తరాంధ్రను వీడి వెళ్లగానే, ఉత్తరాది నుంచి తెలంగాణ మీదుగా, కోస్తాంధ్రవైపు వేడి గాలుల రాక మొదలైందని అధికారులు తెలియజేశారు. ఈ కారణంతోనే ఎండలు ఒక్కసారిగా పెరిగిపోయాయని అన్నారు.
Summer
Heat
Andhra Pradesh
Telangana

More Telugu News