Telugudesam: ఆ విషయం తెలిసే జగన్ ఏపీకీ రావడం మానేశారు: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర

  • పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్రంలో అడుగుపెట్టలేదు
  • ఆయన ఇకమీదట రానవసరంలేదు
  • బీజేపీ మళ్లీ గెలవడం కల్ల
ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తన అభిప్రాయాలు వెల్లడించారు. పార్టీపరమైన సమీక్షా సమావేశాల కోసం అమరావతి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు మద్దతిచ్చారన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఓటమి ఖాయమని తెలిసే జగన్ హైదరాబాద్ కే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. ఏపీలో తమకు అవకాశం లేదని తెలియడంతో ఆయన రాష్ట్రానికి రావడం మానేశారని వ్యాఖ్యానించారు. పోలింగ్ అయిపోయి రోజులు గడుస్తున్నా జగన్ ఇప్పటివరకు ఏపీకి రాలేదని, ఇకమీదట ఆయన రావాల్సిన అవసరం కూడా లేదని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

బీజేపీపైనా ఏపీ మంత్రి వ్యాఖ్యలు చేశారు. మరోసారి గెలుస్తామని బీజేపీ నేతలు భావిస్తున్నారని, కానీ మోదీకి ప్రత్యామ్నాయంగా కేంద్రంలో కొత్త ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం జరగని పని అని స్పష్టం చేశారు. ఈసారి కేంద్రంలో చక్రం తిప్పబోయేది తెలుగుదేశం పార్టీయేనని కొల్లు ఆత్మవిశ్వాసంతో వ్యాఖ్యానించారు.
Telugudesam
Jagan

More Telugu News