AAP: గెంతులు వేసేవాడికి కాదు.. పనిచేసేవాడికి ఓటు వేయండి!: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

  • ఈశాన్య ఢిల్లీలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రచారం
  • బీజేపీ నేత, నటుడు మనోజ్ తివారీపై విమర్శలు
  • తమ అభ్యర్థి దిలీప్ పాండేకు ఓటేయాలని పిలుపు
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు బీజేపీ నేత మనోజ్ తివారీపై విరుచుకుపడ్డారు. నటుడైన మనోజ్ తివారీకి డ్యాన్స్ వేయడం మాత్రమే వచ్చనీ, పనులు చేయడం రాదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అభ్యర్థి దిలీప్ పాండేకు పనిచేయడం మాత్రమే వచ్చనీ, కాబట్టి ఆయనకు ఓటేసి గెలిపించాలని ఈశాన్య ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం ప్రజలను కోరారు. ఈరోజు ఈశాన్య ఢిల్లీలో కేజ్రీవాల్ ఆప్ అభ్యర్థి పాండే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘మనోజ్ తివారీ బాగా ఎగురుతాడు. అందులో ఆయనకు మంచి నైపుణ్యం ఉంది. కానీ పాండేజీకి నర్తించడం రాదు. ప్రజల కోసం పనిచేయడం మాత్రమే ఆయనకు తెలుసు. కాబట్టి ఈసారి పనిచేసేవాడికే మీ ఓటు వేయండి. నర్తించేవాడికి ఓటును వేయవద్దు’ అని ఢిల్లీవాసులను కోరారు.

ఇటీవల బీజేపీ రాంపూర్ అభ్యర్థి జయప్రదను నచ్ నేవాలీ(సినిమా పాటలకు గెంతులేసే మహిళ) అంటూ ఎస్పీ నేత ఆజాంఖాన్ వ్యాఖ్యానించి ఇబ్బందుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈసీ ఏదైనా చర్య తీసుకుంటుందేమో చూడాలి.
AAP
New Delhi
Chief Minister
Arvind Kejriwal
loksabha eklections

More Telugu News