Pakistan: మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి!

  • తమకేమీ అభ్యంతరం లేదన్న పాకిస్థాన్
  • అడ్డుపుల్లలు వెనక్కి తీసుకున్న చైనా!
  • పంతం నెగ్గించుకున్న భారత్
కరుడుగట్టిన ఉగ్రనేత, జైషే మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజహర్ పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయించేందుకు ఎంతోకాలంగా భారత్ చేస్తున్న కృషి ఎట్టకేలకు ఫలించింది. మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇన్నాళ్లూ తనకున్న వీటో పవర్ తో మసూద్ అజహర్ ను కాపాడుకొచ్చిన చైనా ఈసారి ఎలాంటి అడ్డుపుల్లలు వేయకుండా, గతంలో తాను వ్యక్తం చేసిన అభ్యంతరాలను సైతం వాపసు తీసుకుంది. మరోవైపు, పాకిస్థాన్ కూడా మసూద్ అజహర్ పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.

తాజా ప్రకటన అనంతరం మసూద్ అజహర్ ను నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చుతున్నట్టు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయం నేపథ్యంలో మసూద్ అజహర్ పాకిస్థాన్ వెలుపల చేయడానికి ఇంకేమీ ఉండదు. విదేశాల్లో ఉన్న అతని ఆస్తులు జప్తు చేసే వీలుండడంతోపాటు, అతడి ఆర్థిక కార్యకలాపాలకు కూడా తీవ్ర విఘాతం ఏర్పడనుంది. ఏ దేశ ప్రభుత్వమైనా మసూద్ అజహర్ పై చర్యలు తీసుకునే వీలుంటుంది.
Pakistan
India

More Telugu News