Andhra Pradesh: అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు శునకానందం పొందుతున్నారు!: టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • టీడీపీ పాలనలో అందరికీ లబ్ధి చేకూరింది
  • ఒక్కో నియోజకవర్గంలో 1.2 లక్షల మంది లాభపడ్డారు
  • రాజమండ్రిలో మేడే వేడుకల్లో టీడీపీ సీనియర్ నేత
టీడీపీ పాలనలో ప్రతీ నియోజకవర్గంలో 1.20 లక్షల మంది సంక్షేమ పథకాల ద్వారా లాభపడ్డారని ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వీరంతా టీడీపీనే ఆదరించారని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలిచేది చంద్రబాబేననీ, అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని వచ్చేది కార్మిక-రైతు రాజ్యమని ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఈరోజు నిర్వహించిన మే డే వేడుకల్లో టీడీపీ నేతలతో కలిసి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ.. ఏపీలో ఇప్పుడు మేకిన్ ఆంధ్రప్రదేశ్ ను చేపడుతున్నామని బుచ్చయ్య చౌదరి తెలిపారు. దీనివల్ల వందలాది పరిశ్రమలు వస్తున్నాయనీ, నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతోందన్నారు. రాజమండ్రి రూరల్ లో పసుపు-కుంకుమ పథకం కింద 54,000 మంది మహిళలు తలా రూ.20 వేలు లబ్ధి పొందారని గుర్తుచేశారు. మరో 23,000 మంది ప్రజలు నెలనెలా రూ.2 వేలు పెన్షన్ తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాజమండ్రి రూరల్ లో ఐదేళ్ల కాలంలో 4 వేల ఇళ్లు నిర్మించామన్నారు.

వీటి ద్వారా లబ్ధి పొందినవారంతా టీడీపీకే ఓటేశారని తాను నమ్ముతున్నానని చెప్పారు. కానీ కొందరు మాత్రం తామే అధికారంలోకి వస్తామని శునకానందం పొందుతున్నారని ప్రతిపక్ష వైసీపీపై పరోక్ష విమర్శలు చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీ విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Telugudesam
Gorantla Butchaiah Chowdary
YSRCP
Chandrababu
rtajamundry

More Telugu News