Narendra Modi: ప్రధాని మోదీపై మాజీ జవానును పోటీకి దింపిన సమాజ్ వాదీ పార్టీ

  • చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు
  • తేజ్ బహదూర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సమాజ్ వాదీ పార్టీ
  • వారణాసిలో షాలినీ యాదవ్ కు నిరాశ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీచేస్తున్న వారణాసిలో సమాజ్ వాదీ పార్టీ ఆఖరి నిమిషంలో తన అభ్యర్థిని మార్చేసింది. ఇప్పటిదాకా వారణాసిలో సమాజ్ వాదీ అభ్యర్థిగా షాలినీ యాదవ్ పేరు వినిపించింది. పార్టీ కూడా ఆమెనే బలపరిచింది. అయితే, స్థానిక నేతలు షాలినీ అభ్యర్థిత్వంపై వ్యతిరేకత చూపడంతో ఆమె స్థానంలో బీఎస్ఎఫ్ మాజీ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ ను తమ అభ్యర్థిగా ప్రకటించారు.

ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన తేజ్ బహదూర్ తొలుత ఇండిపెండెంట్ గా పోటీచేయాలనుకున్నారు. అయితే అనూహ్యరీతిలో సమాజ్ వాదీ పార్టీ నుంచి ఆయనకు స్పష్టమైన హామీ లభించడంతో ఆ పార్టీ తరఫున పోటీచేస్తున్నట్టు ప్రకటించారు. నామినేషన్ కూడా సమాజ్ వాదీ తరఫునే వేసినట్టు బహదూర్ తెలిపారు. ఆ వెంటనే సమాజ్ వాదీ పార్టీ వర్గాలు కూడా ఓ ప్రకటనలో తేజ్ బహదూర్ తమ పార్టీ తరఫునే వారణాసి నుంచి పోటీచేస్తున్నట్టు వెల్లడించాయి.

గతంలో, బీఎస్ఎఫ్ లో పనిచేసిన తేజ్ బహదూర్ తమకు అందించే ఆహారం విషయంలో సీనియర్ అధికారులు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. విచారణ అనంతరం తేజ్ బహదూర్ దే తప్పంటూ అతడ్ని సర్వీసు నుంచి తొలగించారు.
Narendra Modi

More Telugu News