Pakistan: మూడేళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై అడుగుపెడుతున్న ముషారఫ్

  • 2016లో పాక్ ను వీడిన మాజీ అధ్యక్షుడు
  • అరుదైన వ్యాధితో బాధపడుతున్న వైనం
  • అనారోగ్యం కారణంగా స్వదేశానికి చేరుకోవాలని నిర్ణయం
దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మూడేళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై కాలుమోపనున్నారు. ముషారఫ్ అమైలాయిడోసిస్ అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆయన దుబాయ్ లో చికిత్స పొందుతున్నారని ఆయన తరఫు న్యాయవాది సల్మాన్ సఫ్దర్ తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న ముషారఫ్ పాకిస్థాన్ వస్తేనే బాగుంటుందని ఆయన కుటుంబం భావిస్తోందని సఫ్దర్ వెల్లడించారు.

అన్నివిధాలా మార్గం సుగమం అయితే మే1న ఆయన పాక్ చేరుకునే అవకాశాలున్నాయి. మే2న ఆయనపై కోర్టులో విచారణ జరగనుంది. దేశద్రోహం ఆరోపణల కారణంగా ముషారఫ్ తనకు తాను బహిష్కరణ విధించుకుని 2016లో పాక్ ను వీడారు. దుబాయ్ లో ఉంటున్న ఆయన, తనపై నిజాయతీతో కూడిన విచారణ చేస్తే తప్పకుండా పాకిస్థాన్ వస్తానని చెబుతుండేవారు.

2007లో ఆయనపై పాక్ సుప్రీం కోర్టు దేశద్రోహం ఆరోపణలు మోపింది. ఈ అభియోగాలు నమోదైతే ముషారఫ్ కు మరణశిక్ష కానీ, జీవితఖైదు కానీ విధించే అవకాశాలున్నాయి.
Pakistan

More Telugu News