Andhra Pradesh: విజయసాయిరెడ్డి నీచాతినీచమైన వ్యక్తి.. సీఏగా ఆయన్ను ఐసీఏఐ కూడా తొలగించింది!: బుద్ధా వెంకన్న

  • జగన్ లక్ష కోట్ల దోపిడీకి ఆయన సహకరించారు
  • అందుకే రాజ్యసభ సీటును ఆయన ఇచ్చారు
  • విజయవాడలో మీడియాతో టీడీపీ నేత
వైసీపీ అధినేత జగన్ కు లక్ష కోట్లు దోచుకోవడానికి దారి చూపిన వ్యక్తి విజయసాయిరెడ్డేనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. విజయసాయిరెడ్డి వల్ల జగన్ కు నష్టమే తప్ప లాభం లేదని వ్యాఖ్యానించారు. ఎలా దోచుకోవాలో నేర్పి, జగన్ ను జైలుకు పంపించిన ఘనత విజయసాయిరెడ్డిదేనని పునరుద్ఘాటించారు. ఈరోజు విజయసాయిరెడ్డికి అభిమాన నాయకుడు నరేంద్ర మోదీయేనని ఎద్దేవా చేశారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడారు.

మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ మట్టికరచిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ‘విజయసాయిరెడ్డి నీచాతినీచమైన వ్యక్తి. సీఏగా విజయసాయిరెడ్డిని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ చార్టెడ్ అకౌంటెట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నుంచి తొలగించారు. ఇప్పుడు తిరుమల శ్రీవారి వస్తువులపై విజయసాయిరెడ్డి కన్నుపడింది. అందుకే స్వామివారి వస్తువులు చేజారిపోయాయి’ అని ఆరోపించారు.

జైలు జీవితంలో సహకరించాడన్న అభిమానంతో జగన్ విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆయన విజయసాయిరెడ్డిగా కాకుండా జైలుసాయిరెడ్డిగా మారిపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీని ముంచేది విజయసాయిరెడ్డేనని స్పష్టం చేశారు.
Andhra Pradesh
Telugudesam
budha venkanna
YSRCP
Vijay Sai Reddy]

More Telugu News