Andhra Pradesh: ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీచేసిన ఆర్టీజీఎస్

  • మరో అరగంటలో పిడుగులు
  • విశాఖ, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో పడే అవకాశం
  • పొలాల్లో ఉండే వాళ్లు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలంటూ సూచన
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీచేసింది. మరో అరగంటలో విశాఖ, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని ఓ ప్రకటనలో తెలిపింది.

విశాఖ జిల్లాలో జి.మాడుగుల, పెదబయలు, హుకుంపేట, చింతపల్లి, పాడేరు, అరకు, డుంబ్రిగూడ ప్రాంతాల్లోనూ, తూర్పుగోదావరి జిల్లాలో వై.రామవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో పిడుగులు పడతాయని తెలిపారు.

అంతేగాకుండా, శ్రీకాకుళం జిల్లాలోని భామిని, కొత్తూరు, పాతపట్నం, సీతంపేట ప్రాంతాల్లో పిడుగులు పడతాయని ఆర్టీజీఎస్ అధికారులు హెచ్చరించారు.

కాగా, ఈ సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించారు. ప్రజలు ఈ సమయంలో ఇళ్లలోంచి బయటికి రాకుండా ఉండాలని సూచించారు. మైదానాల్లో, చెట్ల కింద ఉండరాదని, పొలం పనులకు వెళ్లవద్దని తెలిపారు. ముఖ్యంగా, పశువుల, గొర్రెల కాపరులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పేర్కొన్నారు.
Andhra Pradesh

More Telugu News