Srikakulam District: సిగరెట్ తాగుతుంటే అభ్యంతరం.. శ్రీకాకుళంలో బీరుబాటిళ్లతో కొట్టుకున్న యువకులు

  • వైన్‌షాపులో తలలు పగిలేలా కొట్టుకున్న యువకులు
  • ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • పరారైన యువకుల కోసం గాలింపు
సిగరెట్ విషయంలో గొడవ ఇరు వర్గాల మధ్య దాడికి కారణమైంది. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు యువకుల తలలు పగలగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని సుదర్శన్ థియేటర్ సమీపంలోని ఓ మద్యం దుకాణంలో గురువారం  కొందరు యువకులు మద్యం తాగుతున్నారు. ఆ పక్కనే మరో టేబుల్ వద్ద మరికొందరు యువకులు మందు కొడుతున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు సిగరెట్ వెలిగించాడు. అది చూసి పక్కనే ఉన్న యువకులు అభ్యంతరం తెలిపారు. పక్కకెళ్లి తాగాలని కోరారు. దీనికి వారు ససేమిరా అనడంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది.

అది మరింత ముదరడంతో ఇరు వర్గాలకు చెందిన యువకులు తాగుతున్న బీరు బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకుల తలలు పగిలాయి. మరో నలుగురు యువకులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రక్తమోడుతున్న యువకులను ఆసుపత్రికి తరలించారు. కాగా, పోలీసుల రాకను చూసిన యువకులు కొందరు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Srikakulam District
Tekkali
liquor shop
Andhra Pradesh

More Telugu News