దేశ విభజన గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ కటకటాల వెనక్కి పోవాల్సిందే: అమిత్ షా
- రాహుల్, అఖిలేశ్, మాయావతిలకు అమిత్ షా ప్రశ్న
- టెర్రరిస్టులు చనిపోతే మీకెందుకు బాధ అన్న అమిత్
- బీజేపీ ఉన్నంత వరకు కశ్మీర్ ను ఎవరూ వేరు చేయలేరని వ్యాఖ్య
తాము బీజేపీవాళ్లమని, మోదీ తమ ప్రధాని అని... టెర్రరిస్టులతో తాము ప్రేమ వ్యవహారాలు నడపమని అమిత్ షా అన్నారు. దేశ భద్రతతో ఎవరూ ఆడుకోకూడదని చెప్పారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రధాని కావాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించలేదని విమర్శించారు. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై స్పందించాలని గత 14 రోజులుగా తాను అడుగుతున్నా... రాహుల్ నుంచి స్పందనే లేదని ఎద్దేవా చేశారు. కేవలం ఓటు బ్యాంకు గురించే రాహుల్ ఆలోచిస్తున్నారని అన్నారు.
మోదీ మరోసారి ప్రధాని అవుతారని అమిత్ షా జోస్యం చెప్పారు. తమకు అధికారం రాని రోజున ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటామని, బీజేపీలో చివరి కార్యకర్త మిగిలి వున్నంతవరకు దేశం నుంచి కశ్మీర్ ను ఎవరూ వేరు చేయలేరని చెప్పారు. బీజేపీ ఉన్నంత వరకు దేశ విభజన గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ కటకటాల వెనక్కి పోవాల్సిందేనని అన్నారు.