amit shah: దేశ విభజన గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ కటకటాల వెనక్కి పోవాల్సిందే: అమిత్ షా

  • రాహుల్, అఖిలేశ్, మాయావతిలకు అమిత్ షా ప్రశ్న
  • టెర్రరిస్టులు చనిపోతే మీకెందుకు బాధ అన్న అమిత్
  • బీజేపీ ఉన్నంత వరకు కశ్మీర్ ను ఎవరూ వేరు చేయలేరని వ్యాఖ్య

పాకిస్థాన్ లోని బాలాకోట్ ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన దాడులను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు మీకు బంధువులా? అని ఆయన ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ, పాక్ గడ్డపై మన వాయుసేన దాడులు జరిపినప్పుడు యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయిందని... రెండు చోట్ల మాత్రం సంతాపం కనిపించిందని, ఒకటి పాకిస్థాన్ లో, రెండోది రాహుల్, అఖిలేశ్, మాయావతి కార్యాలయాల్లో అని విమర్శించారు. పాకిస్థాన్ టెర్రరిస్టులు హతమయినప్పుడు వీరికి బాధ ఎందుకు కలిగిందో తనకు అర్థం కాలేదని అన్నారు.

తాము బీజేపీవాళ్లమని, మోదీ తమ ప్రధాని అని... టెర్రరిస్టులతో తాము ప్రేమ వ్యవహారాలు నడపమని అమిత్ షా అన్నారు. దేశ భద్రతతో ఎవరూ ఆడుకోకూడదని చెప్పారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రధాని కావాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించలేదని విమర్శించారు. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై స్పందించాలని గత 14 రోజులుగా తాను అడుగుతున్నా... రాహుల్ నుంచి స్పందనే లేదని ఎద్దేవా చేశారు. కేవలం ఓటు బ్యాంకు గురించే రాహుల్ ఆలోచిస్తున్నారని అన్నారు.

మోదీ మరోసారి ప్రధాని అవుతారని అమిత్ షా జోస్యం చెప్పారు. తమకు అధికారం రాని రోజున ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటామని, బీజేపీలో చివరి కార్యకర్త మిగిలి వున్నంతవరకు దేశం నుంచి కశ్మీర్ ను ఎవరూ వేరు చేయలేరని చెప్పారు. బీజేపీ ఉన్నంత వరకు దేశ విభజన గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ కటకటాల వెనక్కి పోవాల్సిందేనని అన్నారు. 

More Telugu News