Devineni Uma maheshwara rao: వైసీపీ నేతలు పది రోజులకు కళ్లు తెరిచారు.. వాస్తవాలు వారికి అర్థమయ్యాయి: ఏపీ మంత్రి దేవినేని

  • టీడీపీ గెలుస్తుందని ఎదురు పందాలు కాస్తున్నారు
  • ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బును ఇలా సంపాదించుకోవాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు
  • లోటస్‌పాండ్‌లో కులుకుతున్న జగన్ కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నారు
ఎన్నికలైన పది రోజుల తర్వాత వైసీపీ నేతలకు జ్ఞానోదయమైందని, వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నాయని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించుకునేందుకు ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తుందని ఎదురు పందాలు కాస్తున్నారని అన్నారు. ఎదురు పందాలు కాయడం ద్వారా పోయిన డబ్బును సంపాదించుకోమని వైసీపీ శ్రేణులకు సమాచారం అందుతోందని ఉమ ఆరోపించారు. ఊహల ప్రపంచంలో ఉన్న వైసీపీ నేతలంతా ఇప్పుడూ భూమ్మీదికి వచ్చారని అన్నారు.

టీడీపీ అధికారంలోకి వస్తుందన్న భయంతో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో కేసులు వేస్తున్నారని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం విషయంలో తెలంగాణ ప్రభుత్వం బ్యాక్ వాటర్ స్టడీస్ పేరుతో కొత్త నాటకాలకు తెరతీసిందన్నారు. దేవాలయాలు మునిగిపోతాయని, పవర్ ప్రాజెక్టులు మునిగిపోతాయని విద్వేషాలు రెచ్చగొట్టే దుర్మార్గమైన చర్యలకు కేసీఆర్ ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. కేసీఆర్‌కు వత్తాసు పలుకుతున్న జగన్‌మోహన్ రెడ్డి ఇప్పుడేమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

తెలంగాణ భూభాగంలో లోటస్ పాండ్‌లో కులుకుతున్న జగన్.. కేసీఆర్‌తో చేతులు కలిపి వాళ్ల మోచేతి నీళ్లు తాగుతున్నారని మండిపడ్డారు. వెయ్యి కోట్ల రూపాయలకు కక్కుర్తిపడి పోలవరంపై కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుంటే జగన్ ఏ కలుగులో దాక్కున్నారని నిలదీశారు. ఎంత విడ్డూరం కాకపోతే పోలవరంలో తవ్వితీస్తున్న మట్టి వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయని కేసులు వేస్తున్న వారు చెబుతారని విరుచుకుపడ్డారు. ప్రాజెక్టును అడ్డుకోవడమే ధ్యేయంగా సుప్రీంకోర్టులోను, గ్రీన్ ట్రైబ్యునల్‌లోనూ కేసులు వేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిబంధనల ప్రకారమే జరుగుతోందని ఉమ స్పష్టం చేశారు.
Devineni Uma maheshwara rao
Andhra Pradesh
Jagan
YSRCP
kcr
polavaram

More Telugu News