Vijender Singh: ఎన్నికల బరిలోకి బాక్సర్ విజేందర్.. కాంగ్రెస్ టికెట్‌పై సౌత్ ఢిల్లీ నుంచి ‘పంచ్’

  • దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి బరిలోకి విజేందర్
  • పోటీ కోసం డీఎస్పీ ఉద్యోగానికి విజేందర్ రాజీనామా
  • బాక్సర్ గెలుపుపై కాంగ్రెస్ ఆశలు

ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్‌ రాజకీయాల్లో పంచ్ విసిరేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం తన డీఎస్పీ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాడు. ఈ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. విజేందర్ రాజీనామాను హరియాణా ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది.

బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న విజేందర్ ఆ ఘనత సాధించిన తొలి భారత బాక్సర్‌గా రికార్డులకెక్కాడు. 2015లో అమెచ్యూర్ బాక్సింగ్ కెరియర్‌కు గుడ్‌బై చెప్పి ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారాడు. రాజీవ్ ఖేల్ రత్న, పద్మ శ్రీ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను విజేందర్ అందుకున్నాడు.

ఢిల్లీలో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ విజేందర్‌ను బరిలోకి దింపుతోంది. దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ రమేశ్ బిధూరీ పోటీ చేస్తున్నారు. ఇప్పుడాయనపై విజేందర్‌ను కాంగ్రెస్ పోటీకి నిలబెడుతోంది. ఈ స్థానం హరియాణాకు ఆనుకుని ఉండడం, జాట్లు, గుర్జర్ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండడంతో వారి ఓట్లను విజేందర్ తనవైపు తిప్పుకుంటాడని కాంగ్రెస్ భావిస్తోంది.

More Telugu News