Janasena: జనసేన పొలిటికల్ క్యాలెండర్ ను సిద్ధం చేస్తున్నాం!: మాదాసు గంగాధరం

  • జనసేన వ్యూహాలు, కార్యక్రమాలతో క్యాలెండర్
  • ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటనలు
  • ఆ తర్వాత కృష్ణా, గుంటూరు, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో 
పార్టీ వ్యూహాలు, కార్యక్రమాలతో జనసేన పొలిటికల్ క్యాలెండర్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాదాసు గంగాధరం స్పష్టం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాలతో పాటు జిల్లాల వారీగా అనుసరించాల్సిన వ్యూహాలు ఇందులో ఉంటాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేసినట్టు చెప్పారు.

తమ పార్టీ తరపున పోటీ చేసిన యువ అభ్యర్థులతో పవన్ కల్యాణ్ నిన్న భేటీ అయిన విషయాన్ని ప్రస్తావించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సాగు, తాగునీటి సమస్యలతో పాటు విద్యా, వైద్యం లాంటి అంశాల మీద జనసేన పార్టీ దృష్టి సారిస్తుందని అన్నారు. పవన్ కల్యాణ్ సూచనల మేరకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు, రాజకీయ నాయకులు పర్యటించనున్నట్టు చెప్పారు. తనతో పాటు పవన్ కల్యాణ్ రాజకీయ సలహాదారు రామ్మోహన్ రావు, నరసాపురం ఎంపీ అభ్యర్థి కొణిదెల నాగబాబు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారని స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్రతో పాటు భీమవరం, గాజువాక, నరసాపురం నియోజకవర్గాల్లో ఈ పర్యటనలు ఉంటాయని అన్నారు. ఉత్తరాంధ్ర పర్యటన అనంతరం కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలోనూ నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి సమావేశాలు ఉంటాయని అన్నారు. తమ ప్రత్యర్థులు చేసే విమర్శలను పట్టించుకోమని, ప్రజా తీర్పును శిరసావహించి మార్పు లక్ష్యంగా తమ పార్టీ ముందుకు సాగుతుందని మాదాసు గంగాధరం పేర్కొన్నారు.
Janasena
Pawan Kalyan
madas gangadharam

More Telugu News