Chandrababu: అది గుజరాత్ మోడల్ కాదు, అభివృద్ధి నిరోధక మోడల్: మోదీపై చంద్రబాబు విసుర్లు
- మట్టి, నీళ్లు ముఖాన కొట్టారు
- ఏ అంశంలోనూ సాయపడలేదు
- అన్నింటికీ అడ్డుపడ్డారు
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి తరఫున కొప్పల్ జిల్లాలోని శ్రీరామ్ నగర్ లో ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. విభజన హామీల విషయంలో మోసం చేశారని మండిపడ్డారు. గత 70 ఏళ్లలో ఎన్నడూ జరగనంత అన్యాయం ఇప్పుడు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా న్యాయం జరగలేదని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు.
కానీ, రాజధాని అమరావతి విషయంలో ఎవరు సాయం చేసినా చేయకపోయినా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేవరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. దేశం గర్వపడేవిధంగా ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో అమరావతి కూడా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ఒక్క పిలుపు ఇవ్వగానే రైతులు ముందుకొచ్చి 34,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. రాజధాని శంకుస్థాపన కోసం ప్రధాని మోదీని పిలిస్తే ఆయన వచ్చి మట్టి, నీళ్లు ముఖాన కొట్టి మీ కర్మ అంటూ వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు.
"రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయంలోనూ నరేంద్ర మోదీ సహకరించలేదు, అడ్డుపడ్డాడు. కేంద్రానికి ఎక్సైజ్ సుంకాల రూపంలో ఐదారు వేల కోట్ల రూపాయలు కడుతున్నాం. అయినాగానీ ఆయన మనసులో రాష్ట్రానికి మేలు చేయాలన్న ఆలోచన కలగడంలేదు. ఏం ఫర్వాలేదు, ఎవరొచ్చినా రాకున్నా అమరావతి మాత్రం ఆగదు. అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేసే బాధ్యత నాదే. ఇప్పుడు మనందరం దేశంలో భాగస్వాములం. మీరు కర్ణాటకలో ఉన్నా, నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా దేశం బాగుంటేనే మనందరం బాగుంటాం. కానీ, నరేంద్ర మోదీ గారు ఆరోజు మాయమాటలు చెప్పారు. మభ్యపెట్టారు. గుజరాత్ మోడల్ లో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇప్పుడు చెబుతున్నాను, అది గుజరాత్ మోడల్ కాదు, అభివృద్ధి నిరోధక మోడల్" అంటూ మండిపడ్డారు.