Chandrababu: చంద్రబాబుతో సమీక్షల్లో పాల్గొన్న అధికారులకు నోటీసులు
- సీఎస్ ను వివరణ కోరిన ఎన్నికల సంఘం
- సీఆర్డీఏ, జల వనరుల శాఖ అధికారులకు నోటీసులు
- వైసీపీ నేతల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్న ద్వివేది
ఎన్నికల ఫలితాలు మరికొన్ని రోజుల్లో వెల్లడికానున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య పోరు మరింత ముదురుతోంది. దీంట్లో సీఎస్ పాత్ర కూడా ఆసక్తికరంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు తరచుగా అధికారులతో సమీక్షలు నిర్వహించడంపై తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సీఎస్ ను వివరణ కోరింది. ఈ నేపథ్యంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షల్లో పాల్గొన్న అధికారులకు నోటీసులు పంపారు.
ఓవైపు ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా, ముఖ్యమంత్రి చేపట్టే సమీక్షల్లో పాల్గొనడంపై సంజాయిషీ కోరారు. ముఖ్యంగా సీఆర్డీఏ, జల వనరుల శాఖ అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం కోరినట్టు తెలుస్తోంది. అటు, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సీఎం సమీక్షలపై వైసీపీ నేతల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై నివేదిక ఇవ్వాలంటూ సీఎస్ ను ఆదేశించినట్టు సమాచారం.