Andhra Pradesh: ఏపీలో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి మెడకు చున్నీ బిగించి హత్యాయత్నం!

  • స్పృహ కోల్పోవడంతో చనిపోయిందనుకుని పరారీ
  • బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
  • కొంతకాలంగా యువతిని వేధిస్తున్న ఆటో డ్రైవర్ బుల్లయ్య
తనను ప్రేమించేందుకు యువతి అంగీకరించకపోవడంతో ఓ ఆటో డ్రైవర్ దారుణానికి తెగబడ్డాడు. యువతి ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడకు చున్నీ బిగించి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఆమె స్పృహ కోల్పోవడంతో చనిపోయిందనుకుని ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని ఎస్.కోట మండలం శివరామరాజుపేటలో ఓ విద్యార్థిని డిగ్రీ చదువుతోంది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ బంగారు బుల్లయ్య తనను ప్రేమించాలని యువతిని వేధించడం మొదలుపెట్టాడు. అయితే ఇందుకు బాధితురాలు నిరాకరించింది. దీంతో ఆమెపై నిందితుడు కక్ష పెంచుకున్నాడు.

ఈరోజు అదే ప్రాంతంలో ఉండే మేనమామ ఇంటికి వెళ్లిన బాధితురాలు.. టీవీ చూస్తూ కూర్చుంది. ఈ సందర్భంగా యువతిని ఆటో డ్రైవర్ బుల్లయ్య వెంబడించాడు. ఇంట్లోకి చప్పుడు చేయకుండా వెనుకనుంచి వచ్చి యువతి మెడకు చున్నీ బిగించి ఊపిరి ఆడకుండా చేశాడు. చివరికి ఆమె అచేతనంగా మారిపోవడంతో చనిపోయిందని అనుకుని ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు.

యువతి సోఫాపై పడిపోయి ఉండటాన్ని కాసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికంగా ఉండే ఓ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు బుల్లయ్యను అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నారు.
Andhra Pradesh
Vijayanagaram District
attack
love affair

More Telugu News