Andhra Pradesh: చంద్రబాబు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమే: సీఈసీని కలిసిన విజయసాయిరెడ్డి

  • ఎన్నికల విధుల్లో ‘నారాయణ- చైతన్య’ ఉద్యోగులు పాల్గొన్నారు
  • వైసీపీ ప్రయోజనాలకు భంగం కలిగింది
  • టీడీపీ ప్రయోజనాలకు ఎటువంటి భంగం వాటిల్లలేదు
ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ సరళి, ఈవీఎంల తీరుపై సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)ని విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ నేతల బృందం ఈరోజు కలిసింది. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘ఎన్నికల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులను నియమించుకోండి. మీ నారాయణ, చైతన్య విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగులను మీరు నియమించవద్దన్న విషయాన్ని పదేపదే మేము చెప్పాం. ఈరోజు తను (చంద్రబాబు) చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తమని చాలా ప్రస్ఫుటంగా తెలుస్తోంది’ అని విమర్శించారు.  

ఎన్నికల పోలింగ్ తీరుపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు కరెక్టు కాదని, ఒకవేళ ఆ ఆరోపణలు నిజమే అయితే, అందుకు కారణం ‘ఆయన (చంద్రబాబు) నియమించినటువంటి నారాయణ, చైతన్య సంస్థల ఉద్యోగులే’ అని ఆరోపించారు. వారి వల్ల వైసీపీ ప్రయోజనాలకు భంగం కలిగిందే తప్ప, టీడీపీ ప్రయోజనాలకు ఎటువంటి భంగం వాటిల్లలేదని అన్నారు. కొన్ని జిల్లాల ఎస్పీలను మార్చమని ఎన్నికలకు ముందు ఈసీని తాము కోరామని, అందులో కొంతమందిని మార్చారు, కొంతమందిని మార్చలేదని గుర్తుచేశారు. ఎక్కడైతే చంద్రబాబునాయుడుకు తొత్తులుగా ఉండే ఎస్పీలు ఉన్నారో, విజయనగరం, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తిందని, అక్కడ హింసాత్మక సంఘటనలు జరిగిన విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.  దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్న ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
Andhra Pradesh
cm
Chandrababu
YSRCP
ys

More Telugu News