Sailajanath: అన్నీ మా చేతుల్లోనే ఉన్నాయని ఎన్నికల కమిషన్ ప్రగల్భాలు పలికింది: శైలజానాథ్

  • ఎన్నికలను వెంటనే రద్దు చేయాలి
  • ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయింది
  • జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయాలి
  • ఓటు వేయడానికి వెళ్తే ఈవీఎంలు పనిచేయవు
ఏపీలో నియమ నిబద్ధత అనేది లేకుండా ఎన్నికలు జరిగాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ విమర్శించారు. నేడు ఆయన విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో జరిగిన ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహణ తీరుని చూస్తే ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని అర్థమవుతోందన్నారు. అన్నీ తమ చేతుల్లోనే ఉన్నాయంటూ ఎన్నికల కమిషన్ ప్రగల్భాలు పలికిందన్నారు.

కొన్ని కోట్ల రూపాయలను ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చు చేసినట్టు కొందరు రాజకీయ నాయకులు చెబుతున్నారని శైలజానాథ్ పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల్లో డబ్బులు పంచారా? లేదా? అనే దానిపై ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయాలన్నారు. ఓటు వేయడానికి వెళ్తే ఈవీఎంలు పనిచేయవని, రాష్ట్రం మొత్తంమ్మీద ఏడు శాతం ఈవీఎంలు పనిచేయలేదన్నారు. అందుకే జరిగిన ఎన్నికలను రద్దు చేయమని కోరుతున్నామన్నారు. ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందిందనటానికి ఎలాంటి సాక్ష్యాలూ అక్కర్లేదని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. 2014లో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహించిందని గుర్తు చేశారు.
Sailajanath
AP Elections
Congress
Fail
EVM
Election Commission

More Telugu News