Poll Affidavit: విద్యార్హత విషయంలో మరోమారు ఇరుక్కున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

  • 2004లో బీఏ పాసైనట్టు పేర్కొన్న స్మృతి
  • గత ఎన్నికల్లో యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నట్టు అఫిడవిట్
  • తాజాగా తన విద్యార్హతను బీకాం ఫస్టియర్‌గా పేర్కొన్న మంత్రి
విద్యార్హత విషయంలో బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరోమారు దొరికిపోయారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఒక్కోసారి ఒక్కోలా చెబుతుండడంతో ఆమె విద్యార్హతల్లో అసలు ఏదో, నకిలీ ఏదో అర్థం కావడం లేదు. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో బీఏ పాసైనట్టు పేర్కొన్న స్మృతి 2014లో దూరవిద్య ద్వారా బీకాం ఫస్ట్ ఇయర్‌కు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. దీంతో 2004లో ఆమె చెప్పింది అబద్ధమని తేలింది.

గత ఎన్నికల్లో ఓడినప్పటికీ మంత్రిగా మానవ వనరుల శాఖను నిర్వహించారు. ఓసారి విలేకరుల సమావేశంలో స్మృతి మాట్లాడుతూ తాను యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్నట్టు చెప్పారు. మరి ఆమె డిగ్రీ చదివితే ఎన్నికల అఫిడవిట్‌లో తాను డిగ్రీ పూర్తిచేసినట్టు ఎందుకు పేర్కొనలేదన్నది ప్రశ్న.

తాజాగా, ఈ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తున్న ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన విద్యార్హతను బీకాం ఫస్టియర్‌గా పేర్కొన్నారు. దూరవిద్య ద్వారా బీకాం ఫస్టియర్‌కు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. ఎక్కడా యేల్ యూనివర్సిటీ డిగ్రీ గురించి ప్రస్తావించలేదు.
Poll Affidavit
Union Minister
Smriti Irani
Graduate

More Telugu News