Chandrababu: ఓటు వేయకుండా వెనక్కి వెళ్లిపోయిన వారిని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను.... ఈ ఒక్కరోజు కష్టపడండి: చంద్రబాబు

  • స్వేచ్ఛగా, భయంలేకుండా ఓటేయండి
  • ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఓటర్లదే
  • ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పోలింగ్ సందర్భంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు సందేశం అందించారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఓటర్లదేనని స్పష్టం చేశారు. ఓటమి భయంతో ఓటింగ్ శాతం తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడిన ఆయన ప్రజలంతా స్వేచ్ఛగా నిర్భీతిగా ఓటేయాలని పిలుపునిచ్చారు.

ఓటింగ్ ను అడ్డుకోవాలనే వైసీపీ కుట్రలను విఫలం చేయాలని, ఓటు వేయకపోతే అరాచకత్వాన్ని ప్రోత్సహించినట్టు అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం ప్రజలు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారని, కానీ, ఈవీఎంల వైఫల్యంతో విసుగుచెంది వెనక్కి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, వెనక్కి వెళ్లిన ఓటర్లను వినమ్రంగా అర్థిస్తున్నాను, రాష్ట్రం కోసం ఈ ఒక్క రోజు కష్టపడండి అంటూ విజ్ఞప్తి చేశారు.

"దయచేసి మళ్లీ ఓపికగా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓట్లు వేయకుండా మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదు. ఓట్లు వేయని వాళ్లు సాయంత్రం ఆరింటి లోపు పోలింగ్ బూత్ లకు చేరుకోండి. మీరు వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తుకు పునాది, భావితరాల భవిష్యత్తు మీ ఓటుపైనే ఆధారపడి ఉంటుంది" అంటూ ఓటర్లకు దిశానిర్దేశం చేశారు.




Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News