Andhra Pradesh: ఈవీఎంలపై వస్తున్న వదంతులు నమ్మొద్దు: ద్వివేది విజ్ఞప్తి

  • మీడియాతో మాట్లాడిన ఎన్నికల ప్రధాన అధికారి
  • 381 ఈవీఎంల్లో సమస్యలున్నట్టు గుర్తించాం
  • ప్రస్తుతం పోలింగ్ సాఫీగా సాగుతోంది
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది పోలింగ్ నేపథ్యంలో తమపై వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, ప్రధానంగా ఈవీఎంల పనితీరు పట్ల వెల్లువెత్తుతున్న విమర్శలకు జవాబిచ్చారు. ఈవీఎంల విషయంలో వస్తున్న వదంతులను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా కేవలం 381 ఈవీఎంల్లోనే సమస్యలు ఉన్నట్టు గుర్తించామని, వాటిలో కొన్ని పదేపదే మొరాయించాయని తెలిపారు. ఇంజినీర్లు వెంటనే ఈవీఎంల లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. చాలావరకు ఈవీఎంల్లో సమస్యలు సమసిపోయాయని, పోలింగ్ సాఫీగా జరుగుతోందని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కొన్ని హింసాత్మక సంఘటనల్లో కేసులు నమోదు చేశామని ద్వివేది చెప్పారు. ఆరు సంఘటనల్లో ఈవీఎంలు ధ్వంసం చేసినట్టు తెలిసిందని, అందుకు కారకులపైనా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇక, ఈవీఎంల్లో సమస్యల కారణంగా పోలింగ్ సమయం వృథా కావడంతో, ఓటేయలేని కొందరు ఓటర్లకు ప్రత్యేకంగా ఓటు వేసే సదుపాయం ఏమీ ఉండదని ద్వివేది స్పష్టం చేశారు. నియమావళి ప్రకారమే నడుచుకుంటామని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.

అయితే, నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల లోపు క్యూలైన్లలోకి వస్తే వాళ్ల కోసం రాత్రి తొమ్మిది, పది గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని, 6 గంటల తర్వాత ఎవరినీ క్యూలైన్లలోకి అనుమతించేది లేదని చెప్పారు.
Andhra Pradesh

More Telugu News