Devineni Uma: కేసీఆర్ గారూ, ఏపీ ప్రజలు అమాయకులు కారు.. మీ వ్యవహారం బోడి మల్లయ్యలా ఉంది!: దేవినేని ఉమ

  • అవినీతి పరుడితో చేతులు కలిపి ఏపీని దెబ్బతీయాలని చూస్తున్నారు
  • కేసీఆర్‌కు జగన్ సామంతుడిలా మారారు
  • దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి చేయనందుకు నమ్మాలా? 
ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామని, జగన్‌తో కలిసి ముందుకెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు. కేసీఆర్ మాటలను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించినందుకా? లేక, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చి, ఆ స్థానంలో మీరు కూర్చున్నందుకా? ఎందుకు మిమ్మల్ని నమ్మాలని సూటిగా ప్రశ్నించారు.

అమరావతిని దెబ్బకొట్టడం ద్వారా మీ ప్రాంతాన్ని బాగు చేసుకోవడానికి ఓ అవినీతిపరుడితో చేతులు కలుపుతారా? అని నిలదీశారు. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసుల వివరాలను దేవినేని మీడియాకు ప్రదర్శించారు. అందులోని వివరాలను చదివి వివరించారు. కేసీఆర్ వ్యవహారశైలి రేవు దాటేంత వరకు ఓడ మల్లయ్య.. దాటక బోడిమల్లయ్యలా ఉందని విమర్శించారు. నేడు కేసీఆర్ సరిగ్గా బోడిమల్లయ్యలానే ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ అధినేత జగన్ ఓ సామంతుడని, కేసీఆర్ వద్ద వెయ్యికోట్ల రూపాయలు తెచ్చుకున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ చెప్పినట్టే జగన్ నడుచుకుంటున్నారని అన్నారు. ఎవరూ సహకరించకున్నా చంద్రబాబు ఓ దైవకార్యక్రమంలా పోలవరాన్ని నిర్మిస్తున్నారని దేవినేని అన్నారు. ఓ మహాసంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారని, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ఉమ పేర్కొన్నారు.
Devineni Uma
Andhra Pradesh
KCR
Jagan
Polavaram

More Telugu News