Yanamala: అమిత్ షా కాదు... అబద్ధాల షా!: యనమల విసుర్లు

  • ఏ రాష్ట్రానికి ఎంతిచ్చారో చెప్పగలరా?
  • దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయండి!
  • ఏ ప్రాతిపదికన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదో చెప్పాలి
అమిత్ షా ఓ అబద్ధాల కోరు అంటూ మండిపడుతున్నారు ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు. అతని పేరు అమిత్ షా కాదని, అబద్ధాల షా అని విమర్శించారు. ఈ ఐదేళ్ల కాలవ్యవధిలో గుజరాత్ కు ఎంతిచ్చారు? ఏపీకి ఎంతిచ్చారో పోల్చగలరా అంటూ సవాల్ విసిరారు. యూపీకి, ఏపీకి ఇచ్చిన నిధులను పోల్చుతారా? అంటూ యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రానికి ఎంతమేర నిధులు ఇచ్చారో అమిత్ షా శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏ ప్రాతిపదికన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరో అమిత్ షా చెప్పాలని యనమల నిలదీశారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధ్యం కానప్పుడు 11 ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఎలా పొడిగించారంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా, పోలవరానికి ఇవ్వాల్సిన రూ.4,500 కోట్ల నిధులను ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదో స్పష్టం చేయాలని అన్నారు. జాతీయ ప్రాజక్టు అయిన పోలవరానికి నిధులు ఇవ్వకపోగా, 'ఏటీఎం' అంటూ విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.

మోదీ సర్కారు తమ అనుకూల రాష్ట్రాల పట్ల ఒకలా, వ్యతిరేక రాష్ట్రాల పట్ల మరోలా వ్యవహరిస్తోందని యనమల మండిపడ్డారు. మోదీ పట్ల అనుకూల ధోరణి కనబరుస్తున్న టీఆర్ఎస్, వైసీపీ, అన్నాడీఎంకేలపై ఎలాంటి దాడులు లేవని, మోదీకి లొంగని టీడీపీ, డీఎంకే, టీఎంసీ పార్టీలపై మాత్రం దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
Yanamala
Amit Shah
Narendra Modi

More Telugu News